Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 277-5
సంపుటము: 3-446
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
కలదందే పో సర్వముఁ గలదు కామితార్థమునుఁ గలదు
కలదు గలదు శరణాగతులకు హరికైంకర్యంబున మోక్షము గలదు
॥పల్లవి॥
ఆకాశంబున మోక్షము వెదకిన నందులోపలా లేదు
పైకొని తానెంత వెదకి చూచినా పాతాళంబున లేదు
యీకడ ధరలో మూలమూలలను యెందు వెదకినా లేదు
శ్రీకాంతుని మతిఁ జింతించి యాసలఁ జిక్కక తొలఁగిన నందే కలదు
॥కల॥
కోటిజన్మములు యెత్తిన ముక్తికి కొన మొదలేమియుఁ గనరాదు
వాటపు సంసారములోఁ గర్మపువార్ధి యీఁదినాఁ గనరాదు
కూటువతో స్వర్గాది లోకములఁ గోరి వెదకినాఁ గనరాదు
గాఁటపు కేశవభక్తి గలిగితే కైవల్యము మతిఁ గానఁగవచ్చు
॥కల॥
సకలశాస్త్రములు చదివినాఁ బరము చక్కటి మార్గము దొరకదు
వికటపు పలువేల్పుల నెందరిఁ గడువెదకి కొలిచినా దొరకదు
అకలంకుఁడు శ్రీవేంకటగిరిపతి అంతరంగమున నున్నాఁడనుచును
ప్రకటముగా గురుఁ డానతి‌ ఇచ్చిన పరము సుజ్ఞానము తనలో దొరకు
॥కల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము