Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 278-5
సంపుటము: 3-451
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
నీకుఁ దొల్లే యలవాటు నిరుహేతుకపు దయ
జోక నురుత మెచ్చిన సులభుఁడవే కా
॥పల్లవి॥
నేరములు దొలఁగించ నెలవులు గలిగించ
గారవించ హరి నీవే కలవు నాకు
నార పేరఁ బిలిచితే నారాయణ యనెనంటా
చేరి కాచినటువంటి శ్రీపతివిగా
॥నీకుఁ॥
దురితము లణఁగించ దుఃఖములు పెడఁబాప
గరిమఁ గేశవ నీవే కలవు నాకు
మరమరా యంటేను మరి రామ యనెనంటా
తిరముగఁ గాచి నట్టి దేవుఁడవుగా
॥నీకుఁ॥
వినుతులు చేకొని వేడుకతో నన్నుఁ గావ
ఘనుఁడ శ్రీవేంకటేశ కలవు నాకు
మనసునఁ దలఁచితే మాటలఁ బిలిచెనంటా
తనిసి కంభాన వెళ్లే దైవమవుగా
॥నీకుఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము