Display:
శృంగార సంకీర్తన
రేకు: 1999-3
సంపుటము: 29-531
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
తనకు దేవుల నేను తా నాకు మగఁడు
వినయాన నన్ను నెంత వేఁడుకొనీనే
॥పల్లవి॥
సిగ్గులువడితిఁగాక చేరి యలిగితినా
వొగ్గి కై దండిచ్చితిఁగా కొరసితినా
దగ్గరి కూచుంటిఁగాక తట్టి గోర నూఁదితినా
వెగ్గళించి పతి యెంత వేఁడుకొనీనే
॥తన॥
కొంగు దీసుకొంటిఁగాక కోపగించితినా
యెంగిలంటిఁగాక మోవి ఇయ్యనైతినా
తొంగి చూచితిఁగాక పొందులు సోదించితినా
వెంగెము లీ వెంట నెంత వేఁడుకొనీనే
॥తన॥
సరసమాడితిఁగాక చలము సాదించితినా
మరిగి పైకొంటిఁగాక మలసితినా
ఇరవై శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
విరులు ముడిచి యెంత వేఁడుకొనీనే
॥తన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము