శృంగార సంకీర్తన
రేకు: 2001-5
సంపుటము: 29-545
రేకు: 2001-5
సంపుటము: 29-545
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
| వట్టి జంపు లిఁక మాతో వద్దు వద్దయ్యా చుట్టరికా లిద్దరివీఁ జూచుకోవయ్యా | ॥పల్లవి॥ |
| పంతమాడవచ్చుఁగాని పాయరాదు సతులను రంతులేల మా యింటికి రావయ్యా చెంతనుండి కొంతవడికి సిగ్గువడవచ్చుఁగాని మంతుకెక్కిన వలపు మఱవరాదయ్యా | ॥వట్టి॥ |
| తేలఁజూచి యాఁడువారిఁ దిట్టు దిట్టవచ్చుఁగాని లోలో తమకము నిలుపరాదయ్యా పాలుపడి రాజసము పచరించవచ్చుఁగాని వోలి విరహపుకాఁక లోరువరాదయ్యా | ॥వట్టి॥ |
| బిగిసి చెలులతోడఁ బెనఁగవచ్చుఁగాని తగులైన పొందికలు దాఁచరాదయ్యా అగపడి శ్రీవేంకటాధిప నన్నేలితివి జిగిమించె నీ కతలు చెప్పరాదయ్యా | ॥వట్టి॥ |


