Display:
శృంగార సంకీర్తన
రేకు: 2002-3
సంపుటము: 29-549
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
పట్టకు పట్టకు నీ పాదాలకు నే మొక్కేను
జట్టి గొన్న నీ మేలుకు సంతోసించుకొంటిని
॥పల్లవి॥
యీవేళ నీ చెక్కు నొక్కి యెంతేసి వేఁడుకొనేవు
నీవు నన్ను మన్నించేది నే నెరఁగనా
ఆవటించి నాపై యాన లదేల పెట్టుకొనేవు
చేవదేరే నీ వలపు చిత్తజుఁ డెరఁగఁడా
॥పట్ట॥
కుచ్చి కాఁగిలించి నన్ను కోరి యెంత లాలించేవు
మచ్చి నీ మన్ననలు మఱచితినా
తచ్చి తచ్చి వూరివారి దారుకాణించ నేఁటికి
ముచ్చట నీ వోజలు మొగాన గానరాదా
॥పట్ట॥
వెలయ నీ మోవితేనె విందు లెంత వెట్టేవు
కలకాలము నీ పొందు కాణాచికాదా
యిలలో శ్రీవేంకటేశ యిన్నిటా నన్నేలితివి
వెలసిన నీ గుణాలు వినయాలేకావా
॥పట్ట॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము