Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 280-6
సంపుటము: 3-464
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
హరిహరియని వెరగందుటఁ గాక
సిరివర మాకు బుద్ధి చెప్పఁగదవయ్యా
॥పల్లవి॥
పాపపుకొంపలో వారు పంచమహాపాతకులు
కాపులకు పదుగురు కర్త లందుకు
తాపి కాండ్లారుగురు ధర్మాసనమువారు
చాపలమే పనులెట్టు జరగీనయ్యా
॥హరి॥
పలుకంతల చేను బండ వెవసాయము
బలిమిఁ దొక్కీఁ గుంటిపసురము
తలవరులు ముగురు తగువాదు లేఁబైయారు
సొలసి ఆనాజ్ఞ కిదుఁ జోటేదయ్యా
॥హరి॥
బూతాల పొంగటికే పొడమిన పంటలెల్లా
కోఁతవేఁత చూచుకొని కోరు కొటారు
యీతల శ్రీవేంకటేశ యిన్ని విచారించి నీ-
చేఁతే నిలిపితి విఁకఁ జెప్పేదేఁటిదయ్యా
॥హరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము