Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 281-1
సంపుటము: 3-465
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
ఏమి సేయుదును నా కేది బుద్ధి యంతర్యామి
యీ మతులఁ జిక్కి నీచిత్తమునకు నెట్టుండునో యని చింతయ్యెడిని
॥పల్లవి॥
కులగోత్రంబులు గుణశీలంబులు
తెలియఁగ గర్వోద్రేకములు
కలసి మెలఁగినఁ గలుగదు జ్ఞానము
తొలఁగిన లోకద్రోహంబు
॥ఏమి॥
మఱియు గృహారామక్షేత్రంబులు
జఱిగొను మాయాజనకములు
మఱవఁగ నివియే మదకారణములు
విఱిగిన సంసారవిరుద్ధము (?)
॥ఏమి॥
అనుపమ వ్రతకర్మానుష్టానము-
లెనలేని బంధహేతువులు
తనిసితి నింక నీదాస్యంబే గతి
ఘనుఁడవు శ్రీవేంకటనాథా
॥ఏమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము