Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 121 సంకీర్తన: 122
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 54
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సౌరాష్ట్ర
ఎటువంటి మోహమో - యింతి! యిదిగో నేడు
తటుకున నిన్ను పేర్కొని - తనకు దానె సిగ్గుపడును
॥పల్లవి॥
అప్పటప్పటికి నీముద్రిక - నట్టె కన్నులనొత్తుక
తప్పక (మదిని) నీ మాటలే - తలచి తల యూచును
చొప్పడ నీరూపమె వ్రా - సుక చూచి ముద్దాడును
కప్పిన తమిని తానె పలికి - కన్నీరు లోలో నించును
॥ఎటువంటి॥
(చెలితోడ) నీమన్ననలెల్ల - చెప్పి చాలాపులకించును
వులికి నిన్నూరకే పిలిచి - వుసురని వెరవుపడును
నెలవుగ అన్నియు మాని నీ - కాలి (చప్పుడాలకించును)
తొలగక నీవు వచ్చే - దోవే తప్పకచూచును
॥ఎటువంటి॥
గక్కున నిన్ను కనుగొంటేను - కడు తానె ముందైపైకొనును
అక్కరతో నిన్ను దగ్గరున్నప్పుడె - యట్టె (తానునరుగును)
(చక్కని) యలమేలుమంగ - సరుగున శ్రీవేంకటేశ
చిక్కి నీకౌగిటిలో నీ - చిత్రమై పరవశమౌను
॥ఎటువంటి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము