Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 96 సంకీర్తన: 157
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 65
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మేచబౌళి
ఎలనాగ యాలౌట - యిది నీకు చాలదా
చెలగి నీవిక వేరె - చింతింపవలెనా
॥పల్లవి॥
ఒకనాడు చెలివద్ద - నుండినను చాలదా
అకట దేవేంద్ర పద - మది యేలవలెనా
శుకవాణి మోవిచవి - చూచినను చాలదా
(నికటామృతము వేరె - నెమ)కంగవలెనా
॥ఎలనాగ॥
నెనరైన సతిగుబ్బ - నిమిరిన చాలదా
కనక దుర్గంబులవి - గైకొనగవలెనా
వనితచూపులకు కై - వశమైన చాలదా
మనసులో వేడుకలు - మదికోరవలెనా
॥ఎలనాగ॥
అలమేలుమంగ గూడి - యలమిన చాలదా
అలరు బ్రహ్మానంద - మది వేడవలెనా
యిల శ్రీవేంకటేశ - యీ పొందు చాలదా
కలికి సంపదలింక - (కలిసి) రావలెనా
॥ఎలనాగ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము