Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 25-2
సంపుటము: 1-150
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
పనిలేని ధనవాంఛఁ బడి పొరలిన నిట్టి
కనుమాయలే కాక కడ నేమిగలదు
॥పనిలేని॥
కనుచూపు కాఁకలఁ గలయుట వెడయాస-
లనుభవింపుట గాక యందేమిగలదు
తనువల్లి సోఁకులఁ దగులుట మమతల-
నెనయఁగోరుట గాక యిందేమిగలదు
॥పనిలేని॥
యెలమి నధర మాను టెరిఁగి యెంగిలి నోర
నలముకొనుట గాక యందేమిగలదు
పలులంపటములచేఁ బడుట దుఃఖంబులు
తలఁ జుట్టుటే కాక తన కేమికలదు
॥పనిలేని॥
శ్రీవేంకటాద్రీశుఁ జేరని పనులెల్ల-
నేవగింతలే కాక యిందేమిగలదు
ఆవల సురతభోగ మనుభవింపఁబోయి
రావలయుటగాక రచనేమిగలదు
॥పనిలేని॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము