అధ్యాత్మ సంకీర్తన
రేకు: 282-1
సంపుటము: 3-470
రేకు: 282-1
సంపుటము: 3-470
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| అతఁడే పరబ్రహ్మ మతఁడే లోకనాయకుఁ- డతనికంటే మరి యధికులు వేరయ్యా | ॥పల్లవి॥ |
| కమలవాసిని లక్ష్మి కలదా యెవ్వరి కైనాఁ గమలనాభునికి నొక్కని కే కాక కమలజుఁడైన బ్రహ్మ కలఁడా యెవ్వని నాభి- నమరవంద్యుఁడు మా హరికే కాక | ॥అతఁ॥ |
| అందరు నుండెడి భూమి యన్యులకుఁ గలదా అందపు గోవిందునికే ఆలాయఁగాక చెందిన భాగీరథి శ్రీపాదాలఁ గలదా మందరధరుఁడయిన మాధవునికిఁ గాక | ॥అతఁ॥ |
| నిచ్చలు నభయమిచ్చేనేరుపు యెందుఁ గలదా అచ్చుగ నారాయణునియందే కాక రచ్చల శరణాగత రక్షణ మెందుఁ గలదా తచ్చిన శ్రీవేంకటాద్రిదైవానకే కాక | ॥అతఁ॥ |


