Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 230 సంకీర్తన: 241
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 130
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ - (వాక్యం)[1]
తలఁచిన హృదయము ఝల్లను - తరుణీమణి యొయ్యారము
కలిగీనా యికనొకపరి - కన్నులఁ జూడఁగను
॥పల్లవి॥
మోమరవంచి పదాంగుట - మున నిల నొయ్యన వ్రాయుచు
కోమలి కన్నీ - రెడనెడ - గ్రుక్కుచు రెప్పలను
వేమరు నాదెస జూచిటు - వీడ్కొన నొల్లని భావము
యేమని తలపోయుదు విధి - నేమని దూరుదును
॥తలఁచిన॥
చెక్కిట చేయిడి యలసత - చే వదనము కడు వాడఁగ
వెక్కసమగు డగ్గుత్తుక - వేడుక నణఁపుచును
అక్కరదీరఁగ నాతో - నాడిన సొలపుల మాటల
నెక్కడ బొగులుదు ధైర్యం - బేగతి నిల్పుదును
॥తలఁచిన॥
నను గృష్ణాయని పేర్కొని - నవ్వుచు కౌఁగిట నలముక
అనువునఁ జిక్కితి విక ని - న్నడుగిడనీ ననుచు
తనువునఁ బులకలు నిగుడఁగ - తామరసానన యెప్పటి
చనవున నొనరించిన యుప - చారపు చందములు
॥తలఁచిన॥

[1] ఇది తాళ్లపాక సంకీర్తనము, శ్రీకృష్ణ పదము. ఇందులో వేంకట ముద్రకు మారుగ శ్రీకృష్ణ ముద్ర కలదు. ఈ పాటయే తంజావూరు ప్రతిలోనూ కన్నడగౌళ రాగమున వాక్యముగా సంకేతింపబడినది. సంకీర్తన రచనలో వాక్యమను నిర్దేశము తాళ్లపాకవారి రేకులందు కానవచ్చును. ఇట ‘వాక్య’ మనునది సంవాదరూపమగు భాషణమను నర్ధమున నున్నట్టున్నది. ఈ పాట ‘తాళ్లపాక సంకీర్తనల’ను వ్రాతప్రతిలోను, తంజావూరి ‘వేంకటేశ’ పదాలందును ఉండుటవల్లను, శైలిని బట్టియు తాళ్లపాక వారి పదముగ భావింపబడినది.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము