Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 143 సంకీర్తన: 145
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 134
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
తానట[1] ప్రాణేశుండట తమకము తమకముఁ గూడఁగ
వేనలి జారినఁ దలఁకని వేడుకలెట్టివొకో
॥పల్లవి॥
మీఁటినఁ బగిలెడిగుబ్బలమీఁద నలందిన గందపు-
వేటులతళుకులు పయ్యెద వెలుఁపలఁ బొలయఁగను
నాఁటిన మదనునిశరముల నలఁకువనొయ్యన తోఁపఁగ
మాటకు మాఁటాడదు చెలిమర్మంబెట్టిదొకో
॥తానట॥
మించిన తొడల మెఱుంగుల మెలుఁతుక గట్టిన పుట్టము
చించుక వెడలిన నిగ్గులు సిగ్గులు దొలఁకగను
వంచినరెప్పల కన్నుల వడియు జలంబులు చెక్కుల
నించినఁ బలుకనిభావపు నెవ్వగలెట్టివొకో
॥తానట॥
కమ్మనితావుల చెమటల గాలికి నొయ్యన మెచ్చుచు[2]
సొమ్మలఁ దేలెడి మరపుల సొక్కులఁ దేలుచును
దిమ్మరికోనేటప్పని తిరువేంకటపతిఁ గూడిన
కొమ్మకు మీఁదటియాసల కోరికలెట్టివొకో
॥తానట॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 292వ సంకీర్తనగా ఉంది.)

[1] తాను ప్రాణే
[2] మెచ్చును
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము