Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 282-5
సంపుటము: 3-474
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
దీనుఁడ నేను దేవుఁడవు నీవు
నీ నిజమహిమే నెరపుటఁ గాకా
॥పల్లవి॥
మతి జనన మెఱఁగ మరణం బెఱఁగను
యితవుగ నిను నిఁక నెరిఁగేనా
క్షితిఁ బుట్టించిన శ్రీపతివి నీవే
తతి నాపై దయ దలఁతువుఁ గాకా
॥దీనుఁ॥
తలఁచఁ బాపమని తలఁచఁ బుణ్యమని
తలఁపున ఇఁక నినుఁ దలఁచేనా
అలరిన నాలో యంతర్యామివి
కలుష మెడయ ననుఁ గాతువుఁ గాకా
॥దీనుఁ॥
తడవ నాహేయము తడవ నామలినము
తడయక నీ మేలు దడవేనా
విడువలేని శ్రీవేంకటవిభుఁడవు
కడదాఁకా నిఁకఁ గాతువుఁ గాకా
॥దీనుఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము