Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 282-6
సంపుటము: 3-475
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
నారాయణాచ్యుతానంత నిన్నొకచోట
గోరి వెదకనేల వీరివల్లఁ గంటిఁ బో
॥పల్లవి॥
సొలసి నీ రూపము శ్రుతులలోఁ జెప్పుఁ గాని
బలిమి నాచార్యుఁడైతేఁ బ్రత్యక్షము
పలికి నీ తీర్థము భావనలందే కాని
అల నీ దాసుల తీర్థ మరచేత నిదివో
॥నారా॥
నీ యానతు లెన్నఁడు నేము దెలియము గాని
మా యాచార్యునిమాట మంత్రరాజము
కాయములో నీ వుండేది కడు మఱఁగులు గాని
యీయెడ నీ పరికర మిన్నిటా నున్నదివో
॥నారా॥
అరిది నీవందన మొకర్చావతారానఁ గాని
గురుపరంపరనై తేఁ గోట్లాయఁ బో
హరి నిన్ను శ్రీవేంకటాద్రినే చూచితిఁ గాని
పరమున నిహమునఁ బంచి చూపె నతఁడు
॥నారా॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము