సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 108 సంకీర్తన: 108
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 178
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 108 సంకీర్తన: 108
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 178
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం - అట
| నేరుపు కలుగు వేళ - (నేము నే మనేము) నేరమి నుండిన వేళ - (నీవె దిక్కనేము) | ॥పల్లవి॥ |
| (కరిణుల)తో పదివేల - గజములు కొలువగా కరి నీకు యెపుడైన - మొరలు వెట్టెనా? అఱిముఱి మకరిచే - ఆపద వచ్చిన వేళ హరి! హరి! కావుమని - అపుడు దలచెను గాక | ॥నేరుపు॥ |
| (ఘనులు పాండవులతో) - కలసి యుండెడి నాడు వెనుక ద్రౌపది తాను - (వేడెనా) మిమ్ము (చెనటియై) కురురాజు - చీరె లొలిచేనాడు వనజాక్ష!యని యపుడు - వగచి తలచెను గాక | ॥నేరుపు॥ |
| మును విభీషణు డన్న - చనవు గలిగిన నాడు మనసున (నొకసారి - మరి తలచెనా మిమ్ము) తన యన్న కోపమున - తలదన్నితే నాడు నెనరు తోడుత దలచి - నిను గొలిచె గాక | ॥నేరుపు॥ |
| చుట్టమైన బంధువైన - స్రుక్కిన వేళల గాక వట్టి మాటల నాడు - వారు మాకేల? అట్టి శ్రీవేంకటేశుడు - ఆపద్భాంధవుడు గాన గట్టిగ తా నభయ మిచ్చి - కరుణించె గాక | ॥నేరుపు॥ |


