Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 211 సంకీర్తన: 222
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 188
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాలం
పాడరే పాడరే - పాడి చూడరే, కుల - పావనియైన యీ పడుచును
ఆడరే చెలు - లందరును గూడుక - అలమేల్మంగనే పడుచును
॥పల్లవి॥
పాలవెల్లి దొలి - చూలు కూతురు - పసిడిబొమ్మ వంటి పడుచును
చాల ముత్తయిదువ - చందమామ - సైదోడైన పడుచును
వోలవోలా అని - జలధిలోపలి వొస - పరైనట్టి పడుచును
నీలవర్ణుని పాలి కీడుజోడైన - నెలత నీ ముద్దుల పడుచునూ
॥పాడరే॥
యేడేడు భువనమ్ములను నిల - బొమ్మరిండ్లుగా గట్టిన పడుచును
తోడునీడై తానె తొలుత బ్రహ్మాండాలు - దొంతులు పెట్టిన పడుచును
యీడైన పడుచుల - నిందారి పెండ్లిండ్లు - (నేరుపడ) జేసిన పడుచును
వేడుక తో గూడి (యాడి) తమలో దామె - వియ్యాలనందిన పడుచును
॥పాడరే॥
కొండకూతురను గూడుక - తుంపెర్లు - గురియుచునుండేటి
నిండు నోములు నోచు - నెలతల కాపురాల్‌ - నిలువ బెట్టినట్టి పడుచును
కొండిక ప్రాయాన (కూడి) యలమేల్మంగ - కొడుకు తల్లైనట్టి పడుచును(?)
వెండియు రఘురాముడై - వెలయుచు శ్రీ-వేంకటేశ్వరుని పడుచును
॥పాడరే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము