Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 25-3
సంపుటము: 1-151
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు
కొండలంత వరములు గుప్పెడువాఁడు
॥కొండలలో॥
కుమ్మరదాసుఁడైన కురువరతినంబి
ఇమ్మన్న వరములెల్ల నిచ్చినవాఁడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం జక్కురవర్తి
రమ్మన్నచోటికి వచ్చి నమ్మినవాఁడు
॥కొండలలో॥
అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి
ముచ్చిలి వెట్టికి మన్ను మోఁచినవాఁడు
మచ్చిక దొలఁకఁ దిరుమలనంబితోడుత
నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాఁడు
॥కొండలలో॥
కంచిలోన నుండఁ దిరుకచ్చినంబిమీఁదఁ గరు-
ణించి తనయెడకు రప్పించినవాఁడు
యెంచ నెక్కుడైన వేంకటేశుఁడు మనలకు
మంచివాఁడై కరుణఁ బాలించినవాఁడు
॥కొండలలో॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము