Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 207 సంకీర్తన: 218
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 192
తాళ్లపాక పెదతిరుమలాచార్య
రాగము: పంతువరాళి
పులుకడిగినయట్టి పురుషోత్తముఁడు వాఁడె
యెలమి నారతులు మీరెత్తరే దేవునికి
॥పల్లవి॥
గొప్పయింద్రనీలాల కొండ మంచు గప్పినట్టు
నెప్పు మింట పాలవెల్లి నెరసినట్టు
విప్పు నీలమేఘముపై వెన్నెల గాసినయట్టు
కప్పురధూళిమేనఁ గప్పిరి దేవునికి
॥పులు॥
నిండు నైరావతముపై నీలిజగ గప్పినట్టు
వెండిమేడపైఁ జీఁకటి విడిసినట్టు
పుండరీకపుఁగొలను పొరిఁదేం ట్లాగినట్టు
మెండగు తట్టుపుణుఁగు మెత్తిరి దేవునికి
॥పులు॥
అదె నల్లఁగలువలన కరువు లుండినట్టు
మెదిగి కస్తూరిభూమి మేరు వున్నట్టు
యెదుట శ్రీవేంకటేశుయెద నలమేల్మంగను
గుదిగుచ్చి సొమ్ములెల్లా గుప్పిరి దేవునికి
॥పులు॥

(ఈ సంకీర్తన 17వ సంపుటంలో 506వ సంకీర్తనగా ఉంది.)

AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము