Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 41 సంకీర్తన: 40
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 276
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
సుదతికి మీరిందరూఁజుట్టాలైన ఫలము
మదనుని వేఁడుకోరే మంచిదౌఁగాని
॥పల్లవి॥
జలములలో నెల్లా చంద్రకాంతాలు చల్లరే
అలతామరలగర్వ మలణఁగుఁ[1]గాని
చలపట్టి వనముల జవ్వాది వాసించరే
మలయుఁ జిలుకలకు మాటుమందౌఁగాని
॥సుదతికి॥
పొదలపై సంపెంగ పువ్వులు వెదచల్లరే
వుదుటఁ దుమ్మిదమూక లుడుఁగుఁగాని
పది దిక్కులను రఘుపతిపేరు దడవరే
గుదిగొన్న కోవిలలు కూయకుండుఁగాని
॥సుదతికి॥
పాటలలో శంకరాభరణం మాళాపించరే
నీటు చల్లగాలి సొంపు నిలుచుఁగాని
యీటున శ్రీవేంకటేశుఁ డేలె నలమేల్మంగను
చాటించరే యిన్నీఁ దొంటి జాడల నుండుఁగాని
॥సుదతికి॥

(ఈ సంకీర్తన 28వ సంపుటంలో 273వ సంకీర్తనగా ఉంది.)

[1] ‘మణఁగుఁగాని’ అనియైనా, ములణఁగుఁగాని అని యైనా వుండవచ్చునని తోచుచున్నది.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము