Display:
సంకీర్తన
తాళ్లపాక వేంకటశేషాచార్యుల
వ్రాతప్రతి పుట: 101 సంకీర్తన: 101
ప్రత్యేక సంపుటము - సంకీర్తన: 278
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కేదారగౌళ
సువ్వి సువ్వి సువ్వని సుదతులు దంచెదరోలాల[1]॥పల్లవి॥
వనితల[2] మనసులు కుందెన చేసిటు[3] వలపులు తగ నించో[4] లాల
కనుసన్నలనెడు రోఁకండ్లను కన్నెలు దంచెదరోలాల
॥సువ్వి॥
బంగారుచెరఁగుల పట్టుపుట్టముల
కొంగులు దూలఁగనోలాల
అంగనలందరు నతివేడుకతో
సంగడి దంచెదరోలాల
॥సువ్వి॥
కురులు దూలఁగ మంచి గుబ్బచన్నులపై
సరులు దూలాడఁగ నోలాల
అరవిరి బాగుల నతివలు ముద్దులు
గురియుచు[5] దంచెదరోలాల
॥సువ్వి॥
ఘల్లు ఘల్లుమని (ను?) కంకణరవములు (ల?)
పల్లవ పాణుల కో (నో?) లాల
అల్లన నడుములు అసియాడుచు సతు
లొల్లనె దంచెదరోలాల
॥సువ్వి॥
కప్పుర గందులు కమ్మని పువ్వుల
చప్పరములలో నోలాల
తెప్పలుగా రతిఁ దేలుచుఁ గోనే
టప్పనిఁ బాడెదరోలాల
॥సువ్వి॥

(ఈ సంకీర్తన 5వ సంపుటంలో 353వ సంకీర్తనగా ఉంది.)

[1] తా.వేం.101 రోలాల
[2] వనిత మన
[3] చేసేటి
[4] నిచ్చో
[5] మురియుచు
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము