Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 25-5
సంపుటము: 1-153
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
పోయం గాలము [1]వృథయై పుట్టిన మొదలుం గటకట
[2]నీయెడ నామది నిజమై నిలుచుట యెన్నఁడొకో
॥పోయం॥
కుడిచిన నాఁకలి దీరదు కుడువఁగఁ గుడువఁగఁ బైపై
కడుఁ బొదలెడు దీపన మిది గడచుట యిఁక నెట్లు
కుడువక మానుట యెన్నడు కోరిక దీరుట యెన్నడు
తడయక నీరూపము నేఁ దలఁచుట లెన్నఁడొకో
॥పోయం॥
జీవుఁడు పుట్టిన మొదలునుఁ జేతికి నూఱట చాలక
యేవిధమున భుజియించిన నెడయదు దీపనము
శ్రీవేంకటపతి నా కిఁక శ్రీకరుణామృత మియ్యక
పావనమందదు నామది పాలించం దగదా
॥పోయం॥

[1] ‘వ్రిథయై’ రేకు.

[2] ‘యడ’ రేకు.
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము