అధ్యాత్మ సంకీర్తన
రేకు: 287-2
సంపుటము: 3-501
రేకు: 287-2
సంపుటము: 3-501
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| దిక్కులెల్లా సాధించి దేవదుందుభులు మ్రోయ- నెక్కడ చూచినఁ దానే యేఁగీ సేవించరో | ॥పల్లవి॥ |
| అదివో శ్రీహరి తేరు అదె గరుడధ్వజము కదలేటి ఘనతురంగము లవిగో పొదలుఁ బూదండలవే పూచి వాఁగే ఘంటలవే యెదుటఁ దిరువీధుల నేఁగీ సేవించరో | ॥దిక్కు॥ |
| వారె అచ్చరలేమలు వారె మునులు రుషులు వారక కొలిచే దేవతలు వారే వీరె యనంతగరుడవిష్వక్సేనాదులు యీ రీతిఁ బ్రతాపాన నేఁగీ సేవించరో | ॥దిక్కు॥ |
| వీఁడె శ్రీవేంకటేశుఁడు వీఁ డలమేల్మంగపతి వీఁడె శంఖచక్రాదుల వెలసినాఁడు పోఁడిమి వరములిచ్చీఁ బొసఁగ దాసులకెల్లా యేఁడేఁడు దప్పకుండాను యేఁగి సేవించరో | ॥దిక్కు॥ |


