Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 287-5
సంపుటము: 3-504
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
అవధారు సకలలోకైకనాథ
సువర్ణరూపమైన సుగ్రీవనారసింహా
॥పల్లవి॥
అరుదుగ మీరు సింహాసనముపై నుండఁగ
యిరుగడ సేవించేరు ఇంద్రాదులు
పరగ నెట్టనెదుట ప్రహ్లాదుఁ డున్నవాఁడు
సొరిదినే చిత్తగించు సుగ్రీవ నారసింహా
॥అవ॥
చాపలపు హిరణ్యుని సమయించి వున్నమీకు
చేపట్టి మొక్కేరు వశిష్ఠాదులు
యే పొద్దు మీ తొడమీఁద నిందిర గాచుకున్నది
చూపులఁ గరుణ నించు సుగ్రీవ నారసింహా
॥అవ॥
లలితముగ నీవు జగములు రక్షించఁగా
వలనుగఁ బొగడేరు వ్యాసాదులు
యెలమి శ్రీవేంకటేశ ఇందునందు నెలకొని
సులభమూర్తివైతివి సుగ్రీవ నారసింహా
॥అవ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము