అధ్యాత్మ సంకీర్తన
రేకు: 288-1
సంపుటము: 3-506
రేకు: 288-1
సంపుటము: 3-506
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| కంభమున వెడలి ఘననరసింహము కుంభిని హిరణ్యుఁ గూలిచెను | ॥పల్లవి॥ |
| తొడికి దైత్యుఁ దన తొడపైకిఁ దిగిచి కడుపు చించి రక్తము చల్లి జడియక పేగులు జందెంబులుగా మెడఁ దగిలించుక మెరసీ వాఁడే | ॥కంభ॥ |
| పెదవులు చింపుచు పెనుగోళ్ల నదిమి వుదుటుఁ బునుక గొరికుమియుచును సదరపు గుండెలు చప్పరింపుచును మెదడు గందముగ మెత్తీ వాఁడే | ॥కంభ॥ |
| దేవతల భయము దీర్చి యంకమున శ్రీవనితనుఁ గృప సేయుచును పావనపు టహోబలగిరి దైవము శ్రీవేంకటగిరిఁ జెలఁగీ వాఁడే | ॥కంభ॥ |


