Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 289-6
సంపుటము: 3-517
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
కోనేటి దరులఁ గనుఁగొనరో మూఁడుదేరులు
నానాదేవతలార నరులార మీరు
॥పల్లవి॥
తెంకిగా ముందర నొక్క తేరెక్కె శ్రీకృష్ణుఁ డు
వేంకటేశుఁ డెక్కె నదె వేరొక్క తేరు
లంకెలై శ్రీభూసతులు లలి నొక్క తేరెక్కిరి
కొంకక వీధుల నడగొండలో యనఁగను
॥కోనే॥
యిరవై శ్రీకృష్ణునిది యిదె వానరధ్వజము
గరుడధ్వజము శ్రీవేంకటపతిది
కరిలాంఛన ధ్వజము కమలకు మేదినికి
అలరి చూపట్టెను బ్రహ్మాండాల వలెను
॥కోనే॥
చెలఁగి చెఱకువిల్లు చేతఁబట్టె శ్రీకృష్ణుఁడు
బలు శ్రీవేంకటేశుఁడు పట్టెఁ జక్రము
అలమేలుమంగ భూమి యంబుజాలు చేఁబట్టిరి
కలసి మెలసేరు బంగారుమేడ లనఁగ
॥కోనే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము