అధ్యాత్మ సంకీర్తన
రేకు: 290-4
సంపుటము: 3-521
రేకు: 290-4
సంపుటము: 3-521
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| కలశాపురముకాడ గంధపుమాకుల నీడ- నలరేవు మేలు మేలు హనుమంతరాయ | ॥పల్లవి॥ |
| సంజీవికొండ దెచ్చి సౌమిత్రి బ్రతికించితి భంజించితి వసురుల బలువిడిని కంజాప్తకుల రాఘవుని మెప్పించితివి అంజనీతనయ వో హనుమంతరాయ | ॥కల॥ |
| లంక సాధించితివి నీ లావులెల్లాఁ జూపితివి కొంకక రాముని సీతఁ గూరిచితివి లంకెల సుగ్రీవునికి లలిఁ బ్రధాని వైతివి అంకెలెల్లాఁ నీకుఁ జెల్లె హనుమంతరాయ | ॥కల॥ |
| దిక్కులు గెలిచితివి ధీరతఁ బూజ గొంటివి మిక్కిలి ప్రతాపాన మెరసితివి ఇక్కువతో శ్రీవేంకటేశ్వరు బంట వైతివి అక్కజపు మహిమల హనుమంతరాయ | ॥కల॥ |


