అధ్యాత్మ సంకీర్తన
రేకు: 291-3
సంపుటము: 3-526
రేకు: 291-3
సంపుటము: 3-526
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| ఇతరుల నడుగము యితఁడే మా దాత యితని యీవి వొరు లియ్యఁగఁ గలరా | ॥పల్లవి॥ |
| దేవ దేవుఁ డాదిమపురుషుఁడు హరి శ్రీవత్సాంకుఁడు చిన్మయుఁడు యీవల నావల యిలువేలుపతఁడు భావజగురుఁడు మా పాలిటివాఁడు | ॥ఇత॥ |
| జగదేకగురుఁడు శాశ్వతుఁ డచ్యుతుఁ- డగజకు వరదుఁడు అనంతుఁడు తగి మము నేలిన దైవము యేలిక నిగమమూర్తి మా నిజబంధువుఁడు | ॥ఇత॥ |
| కలిదోషహరుఁడు కైవల్యవిభుఁడు అలరిన శ్రీవేంకటాధిపుఁడు చలిమి బలిమి మా జననియు జనకుఁడు అలమి యితఁడు మాయంతర్యామి | ॥ఇత॥ |


