Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 293-3
సంపుటము: 3-538
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
ఏమి సేయఁగలఁడు తానీ జగమెల్లాను
కోమలపు దేహి కొక్కకోకే కలది
॥పల్లవి॥
మించిన కోరికలివి మిన్నుల పొడవులు
కొంచపు దేహము దనకొలఁది గాదు
యెంచరాని సిరు లవి యెన్ని గలిగినా
కంచములోని కూడే కలిగినది
॥ఏమి॥
గోరపడి గడించేవి కోట్ల కొలఁదులు
తారితూరి నోటికిఁ దగ్గంత గాదు
యేరుపరచి యింతుల నెందరిఁ బెండ్లాడినాను
కూరిమి సతి యొకతె కూటమికిఁ గలది
॥ఏమి॥
తలఁచి మొక్కే సురలు తలవెంట్రుకలందరు
యిలఁ దన బతుకెంతో యెరఁగరాదు
చెలఁగి రక్షించేవాఁడు శ్రీవేంకటేశుఁ డొకఁడే
కల డంతరంగమునఁ గైవల్యమే కలది
॥ఏమి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము