అధ్యాత్మ సంకీర్తన
రేకు: 26-2
సంపుటము: 1-157
రేకు: 26-2
సంపుటము: 1-157
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| చావుతో సరియైన సౌఖ్యంబులోఁ దగిలి వేవేలు దురితముల వేగించు టొండె | ॥చావుతో॥ |
| కనుఁగొనల నిరుమేను గాఁడి పారుట లొండె చనుఁగొండలను [1]మహాచరులఁ బడు టొండె తనివోని సురతములఁ దగిలి మునుఁగుట యొండె ఘనమోహబంధములఁ గట్టువడు టొండె | ॥చావుతో॥ |
| మొనసి యాశాపాశముల యురులఁ బడు టొండె కనలి పొలయలుకచేఁ గాఁగు టది యొండె మనసు [2]కాఁతాళమున మల్లువెనఁగుట లొండె పనిలేని మదనాగ్నిఁ బడి పొరలు టొండె | ॥చావుతో॥ |
| తడసి మమతల నిరంతర [3]దైన్యమది యొండె నడుమనే కన్నుగానక తిరుగు టొండె యెడప కీతిరువేంకటేశుఁ దలఁపఁగలేక పడని పాట్లనెల్లఁ బడి వేఁగు టొండె | ॥చావుతో॥ |
[1] ‘మహాచరుల’ విరుద్ధసమాసము. ఈ చిల్లరదోషముల కీవాఙ్మయమున పట్టింపు లేదు.
[2] ‘కాంతాళమున’ పూ.ము.పా. రేకులందంతటా ‘కాఁతాళ’మనియే వున్నది.
[3] ‘ధైర్య’ పూ.ము.పా.


