Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 295-1
సంపుటము: 3-548
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: తెలుఁగుకాంబోది
ఇందునే తుదిపద మెక్కి రిందరును
మందరధర నీ మహిమిదివో
॥పల్లవి॥
మరిగిన పుణ్యుల మతిలో కోరిక
పరమపు హరి నీ పాదములు
గరిమ గోపికలు గావలెనన్నది
హరి నీ సంభోగ మదియెపో
॥ఇందు॥
పొంచి వేదములు పొగడెడి యర్థము
అంచెల గుణకథ లవి నీవి
పంచి యజ్ఞముల ఫలమై యున్నవి
నించి దేవ నీ నిజపూజలెపో
॥ఇందు॥
కై వల్యమునకుఁ గడుఁ దెరువై నది
ఆవల నీ శరణాగతియే
శ్రీవేంకటేశ్వర చెప్పె మా గురుడు
మావద్ద నిదె నీ మంత్రమెపో
॥ఇందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము