అధ్యాత్మ సంకీర్తన
రేకు: 26-3
సంపుటము: 1-158
రేకు: 26-3
సంపుటము: 1-158
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఆఁకటి వేళల నలపైన వేళలను తేఁకువ హరినామమే దిక్కు మఱి లేదు | ॥ఆఁకటి॥ |
| కొఱమాలివున్న వేళ కులము చెడిన వేళ చెఱఁవొడి వొరులచేఁ జిక్కిన వేళ వొఱపైన హరినామ మొక్కటే గతిగాక మఱచి తప్పిననైన మఱిలేదు తెఱఁగు | ॥ఆఁకటి॥ |
| ఆపద వచ్చిన వేళ యారడిఁ బడిన వేళ పాపపు వేళల భయపడిన వేళ వోపినంత హరినామ మొక్కటే గతిగాక మాపుదాఁకాఁ బొరలిన మరిలేదు తెఱఁగు | ॥ఆఁకటి॥ |
| సంకెళఁ బెట్టిన వేళ చంపఁ బిలిచిన వేళ అంకిలిగా నప్పులవా రాఁగిన వేళ వేంకటేశునామమే విడిపించ గతిగాక మంకుబుద్ధిఁ బొరలిన మరిలేదు తెఱఁగు | ॥ఆఁకటి॥ |


