అధ్యాత్మ సంకీర్తన
రేకు: 295-2
సంపుటము: 3-549
రేకు: 295-2
సంపుటము: 3-549
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| గోవిందుదాసులమై కొన కెక్కుదుముఁ గాక వేవేలు విధుల నమ్మి వెతఁబడఁగలమా | ॥పల్లవి॥ |
| మనసు లోపలి మామర్మము దెలియలేము ఘనుఁడైన హరి నెట్టు గానఁగలము తనువుతో భోగాలు తగులు వీఁడగలేము వెనక కర్మపాశాలు వీడించుకోఁగలమా | ॥గోవిం॥ |
| వడిఁ బెట్టే యింద్రియాల వద్దని మానుపలేము తొడరి సంసారము తోయఁగలమా బడిబడి నానాటి బతుకు చెప్పుకోలేము పొడలేటి యితరుల బోధించఁగలమా | ॥గోవిం॥ |
| కొంకక ఆడిన మాట గురుతు వెట్టఁగలేము లంకె వేదవాక్యము దలఁచఁగలమా యింకా శ్రీవేంకటేశుఁ డితఁడే మా దేవుఁడని సంకెలేకుందుముఁ గాక జాలిఁబడఁగలమా | ॥గోవిం॥ |


