అధ్యాత్మ సంకీర్తన
రేకు: 297-5
సంపుటము: 3-564
రేకు: 297-5
సంపుటము: 3-564
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఓహో నిలిచిన దొకటిదియే శ్రీహరి సాకారచింతనము | ॥పల్లవి॥ |
| పంచమవేదపు పద్మాక్షునామము అంచెఁ బాపహర మౌషధము పంచలఁ బీతాంబరు శరణాగతి ముంచిన యజ్ఞానమునకు దీపము | ॥ఓహో॥ |
| విందులకుడుపులు విష్ణుకీర్తనము చందపు వైకుంఠ(ము?) సంబళము పొందుగ నచ్యుతుఁ బూజించు పూజలు కిందటఁ గొనకెక్కెడి నిచ్చెనలు | ॥ఓహో॥ |
| కట్టిన ముడుపగు ఘన కృష్ణభక్తి ముట్టిన పాపవిమోచనము యిట్టే శ్రీవేంకటేశ్వరు కృప యిది పట్టినవారికి బలువగు కొమ్ము(మ్మ?) | ॥ఓహో॥ |


