అధ్యాత్మ సంకీర్తన
రేకు: 299-6
సంపుటము: 3-577
రేకు: 299-6
సంపుటము: 3-577
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీఁడు తిద్దరాని మహిమల దేవకిసుతుఁడు | ॥పల్లవి॥ |
| అంతనింత గొల్లెతల అరచేతి మాణికము పంతమాడే కంసుని పాలి వజ్రము కాంతుల మూఁడులోకాల గరుడపచ్చఁబూస చెంతల మాలోనున్న చిన్నికృష్ణుఁడు | ॥ముద్దు॥ |
| రతికేలి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము సతమై శంఖచక్రాల సందుల వైడూర్యము గతియై మమ్ముఁ గాచేటి కమలాక్షుఁడు | ॥ముద్దు॥ |
| కాళింగుని తలల పైఁ గప్పిన పుష్యరాగము యేలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము పాలజలనిధిలోనఁ బాయని దివ్యరత్నము బాలుని వలెఁ దిరిగీఁ బద్మనాభుఁడు | ॥ముద్దు॥ |


