Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 301-4
సంపుటము: 4-4
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
నిజమో కల్లో నిమిషములోననె
భజించువారల భాగ్యము కొలఁది
॥పల్లవి॥
వొకఁడు కనుదెరచి వున్నది జగమను
వొకఁడు కన్నుమూశొగి లేదనును
సకలము నిట్లనె సర్వేశ్వరుఁడును
వెకలినరులు భావించినకొలఁది
॥నిజ॥
కడుపు నిండొకఁడు లోకము దనిసె ననును
కడుపు వెలితైనఁ గడమను నొక్కఁడు
తడవిన నిట్లనే దైవమిందరికి
వెడగునరులు భావించిన కొలఁది
॥నిజ॥
ముదిసి యొకఁడనును మోక్షము చేర్వని
తుదఁ బుట్టొకఁడది దూరమనును
యెదుటనే శ్రీవేంకటేశ్వరుఁ డిట్లనే
వెదకి నరులు భావించిన కొలఁది
॥నిజ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము