Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 313-5
సంపుటము: 4-77
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
హరి "సర్వపాపేభ్యో అహం త్వా" యనె
గరిమ నా వాక్యమే ప్రమాణమైనట్టి గతి యొక్కటే నాకు
॥పల్లవి॥
యిన్ని జన్మములఁ బుట్టి యేఁ జేసినపాపములు యిఁక
నన్నిజన్మములఁ బుట్టి అట్టె పుణ్యములు సేసి అవి పాపుకోఁగలనా
పన్నినదొంతులపైఁ బడ నొక్క గుదియపెట్టు
వున్నతి మోఁదినయట్టు హరిశరణాగతి యదియొక్కటే నాకు
॥హరి॥
యింతగాల మింద్రియముల నిట్టె సాఁగినతలఁపు యిఁక
నంతగాలము చిత్త మాఁగి నే నది దిప్పుకోఁ గలనా
చెంతఁ బంటెఁడుపాలలో నొక చల్లబొట్టు చేమిరివెట్టినట్టు
అంతటికిని శ్రీహరి శరణాగతి యది యొక్కటే నాకు
॥హరి॥
పలు శాస్త్రములు చూచి బహుదేవతలఁ గొలిచి పఱచైన యీదేహము
పలుసందేహములను వచ్చినతెరువునను పాపుకో నేఁ గలనా
యిల నంధకారపుటింటిలో నొకదీప మెత్తి మెఱసినట్టు
వొలసి శ్రీవేంకటపతి శరణాగతి వొకటే గతి నాకు
॥హరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము