అధ్యాత్మ సంకీర్తన
రేకు: 315-2
సంపుటము: 4-85
రేకు: 315-2
సంపుటము: 4-85
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఎక్కడ నెదురు లేక యీరేడులోకములందు వొక్కఁడే నిలిచెనమ్మ వుగ్రహనుమంతుఁడు | ॥పల్లవి॥ |
| పెట్టినజంగదండ పిడికిటి మొలచేయి అట్టె వలచేయెత్తిన యాయితము తొట్టిన పెంజమటలు తోడనె బుసకొట్టులు వుట్టీపడీఁ జూడరమ్మ వుగ్రహనుమంతుడు | ॥ఎక్కడ॥ |
| నిక్కినకర్ణములు నింగిమోఁచినబొమ్మలు చక్కశిరసుపైఁ బారఁజూచిన తోఁక చుక్కలు మొలపూసలు సూదుల వాఁడి రోమాలు వుక్కుమీరెఁ జూడరమ్మ వుగ్రహనుమంతుడు | ॥ఎక్కడ॥ |
| పుట్టుఁగౌపీనము మహద్బుత యజ్ఞోపవీతము గుట్టుచూపని కనకకుండలములు పట్టపు శ్రీవేంకటేశు బంటయి ప్రతాపమెల్ల వొట్టీ విజయనగరపు వుగ్రహనుమంతుడు | ॥ఎక్కడ॥ |


