అధ్యాత్మ సంకీర్తన
రేకు: 321-2
సంపుటము: 4-119
రేకు: 321-2
సంపుటము: 4-119
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| నేఁడుగాక దొరనైతి నేను నారాయణుఁ గొల్చి పోఁడిమి నాచార్యుని బోధ వంకను | ॥పల్లవి॥ |
| దీనవృత్తి నేఁ దిరుగని చోటేది నానాచంచలము నామనసు పూని నేఁగొనని భువిలోని రుచు లేవి హీనజన్మము లెత్తిన దీమేను | ॥నేఁడు॥ |
| చేరి నేఁజేచేతఁ జేయనిపాప మేది ధారుణి మోపైన సంసారమునను ఆరయ మున్ను నేనాడని కల్లలేవి సారెకు నుదురుపోషణమునకు | ॥నేఁడు॥ |
| సూటిదప్పక నేఁ జూడని చూపేది చేటులేని చిరకాల జీవుఁడనే చాటువ శ్రీవేంకటేశు శరణు చొరకతొల్లి బూటకము లెన్ని లేవు పొలయదు కాలము | ॥నేఁడు॥ |


