Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 322-4
సంపుటము: 4-127
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
కామధేనువు దేవకల్పితము భువిలోన
వోముచును భోగించ యుక్తివలెఁ గాని
॥పల్లవి॥
తలఁచినట్లనౌ దైవము వ్రాసిన వ్రాఁత
పలికినట్లనౌ పలుమంత్ర జపములు
నిలిపినట్లనౌ నిర్మల చిత్తము కీలు
నెలవునఁ బనిగొన నేర్పువలెఁ గాని
॥కామ॥
యిమ్మనినట్ల నిచ్చు నేచినకర్మఫలము
కమ్మన్నట్లనౌ ఘనతపముల శక్తి
తెమ్మనినయట్లఁ దెచ్చు ద్రిష్ఠము యక్షిణీవిద్య
చిమ్ములను దనకంత చింతవలెఁగాని
॥కామ॥
వునిచినట్లనుండు నొక్కడే దేహగుణము
యెనలేని శ్రీవేంకటేశ్వరుమాయ లివి
పెనచిన యిహమేపో బీజము వుద్యోగులకు
తనివి నలమేల్మంగదయ వలెఁగాని
॥కామ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము