Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 323-2
సంపుటము: 4-131
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
పుట్టెడి దింతా బూటకంబులే
గట్టిమాయ హరిఁ గానఁగ నీదు
॥పల్లవి॥
ముక్కున నున్నది ముందటఁ బ్రాణము
యెక్కడ నమ్మేదిఁకఁ దనువు
చుక్కలు మోఁచీఁ జూపులెదుటనే
నెక్కొను మతికిని నిలుకడ యేది
॥పుట్టెడి॥
నాలుక నున్నవి నానారుచులును
వేళావేళకు వెరవేది
తోలున నున్నది దొరకొని బ్రతుకిది
కాలంబెటువలెఁ గడపేది
॥పుట్టెడి॥
ఆతుమనున్నది యఖిలజ్ఞానము
ఘూతల నెటువలెఁ గనియేది
శ్రీతరుణీపతి శ్రీవేంకటపతి
యాతనిఁగొలిచితి మడ్డంబేది
॥పుట్టెడి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము