Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 323-4
సంపుటము: 4-133
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
ఇలువేల్పితఁడే ఇందరికిని మరి
పలు వేల్పులతో పని యిఁకనేలా
॥పల్లవి॥
కమలారమణుని కరుణేకాదా
అమరులు గొనియెడి యమృతము
అమితపు శ్రీహరి యాధారముగాదా
నెమకేటి ప్రాణులు నిలిచినభూమి
॥ఇలువే॥
దనుజాంతకు బొడ్డుతామెర కాదా
జననకారణము సర్వమునకు
మనికై హరిసతి మహిమే కాదా
నినుపై భువిలో నిండినసిరులు
॥ఇలువే॥
యితనికొడుకు రచనింతాఁగాదా
సతుల పతుల సంసారరతి
గతి శ్రీవేంకటపతిలోకమె వు-
న్నతి వైకుంఠపు నగరపు ముక్తి
॥ఇలువే॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము