Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 323-6
సంపుటము: 4-135
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
మఱి విచారించఁబోతే మంచంముకిందే నూయి
మెఱయఁగ హరిఁ గొల్చి మించరో ప్రజలు
॥పల్లవి॥
యేల మాను దేహమెప్పటి తనగుణము
యేల మాను మనసెడలేనియాసలు
ఱాలు దింటా మలిగండ్లేఱఁగనేల హరి మన-
పాలఁ బెట్టుక కొలచి బ్రతుకరో ప్రజలు
॥మఱి॥
పొమ్మంటేనేలపోవు పూర్వకర్మములు
పొమ్మంటేనేలపోవు పొంచిన యింద్రియములు
కుమ్మరావమునఁ జెంబు కోరి వెదకనేల
పమ్మిని శ్రీపతిఁ గొల్చి బదుకరో ప్రజలు
॥మఱి॥
భోగించకేల పోవుఁ బుట్టిన జన్మఫలము
లోఁగుచుఁ బిండికూరలోన నలుపెంచనేల
వేగిరమేఁటికి శ్రీవేంకటేశుమాయ లివి
బాగుగ నాతనిఁగొల్చి బ్రదుకరో ప్రజలు
॥మఱి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము