Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 324-1
సంపుటము: 4-136
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భవుళి
కటకట నేమూ కర్తలము గాము
ఘటన శ్రీపతి నీవే కావఁ గదవయ్యా
॥పల్లవి॥
పుడమిఁ బుట్టితిమి బుద్ది నెరిఁగితిమి
కడుపే చెరువవుత గానమయ్యా
వొడలు మోఁచితిమి వున్నతిఁ బెరగితిమి
వెడఁ జిల్లులఁ గారేది విడిపించ లేవయ్యా
॥కట॥
నిన్న నిద్రించితిమి నేఁడే మేలుకొంటిమి
తిన్న వెల్లఁ దీరినటే తెలియమయ్యా
కన్నులఁ జూచితిమి కమ్మర మూసితిమి
వున్నచే నుండదు మతి పూరట లేదయ్యా
॥కట॥
సరిఁ జదివితిమి శాస్త్రముఁ జూచితిమి
గురుఁడే రక్షకుడౌత గురుతౌనయ్యా
నిరతి శ్రీనేంకటేశ నిన్నే నమ్మితిమి
పరదైవములతోడిపని మాకు లేదయ్యా
॥కట॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము