అధ్యాత్మ సంకీర్తన
రేకు: 325-4
సంపుటము: 4-145
రేకు: 325-4
సంపుటము: 4-145
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| హరికి లంకిణీహంత కంతర మిట్టున్నది కరుణ నింత మన్నించె కమలావిభుఁడు | ॥పల్లవి॥ |
| విశ్వరూపు చూపినాడు విష్ణుఁడు దొల్లి యట్టె విశ్వరూపాంజనేయుఁడు వీఁడె చూపెను శాశ్వతుఁడై యున్నవాఁడు సర్వేశ్వరుఁడు వీఁడే శాశ్వతుఁడై యున్నవాఁడు జగములో నీతఁడు | ॥హరి॥ |
| ప్రాణవాయుసంబంధి పరమాత్మఁడు అట్టె ప్రాణవాయుసుతుఁడు పవనజుఁడు రాణింప రవివంశుఁడు రామచంద్రుడు తాను నాణెపు రవిసుతుని నమ్మిన ప్రధాని | ॥హరి॥ |
| దేవహితార్థముసేసఁ ద్రివిక్రముఁడు అట్టె దేవహితార్థమే జలధిలంఘనుఁడు శ్రీవేంకటేశుఁడు చిన్మయమూర్తి తాను కోవిదుఁడు జ్ఞానమూర్తి గొప్పహనుమంతుఁడు | ॥హరి॥ |


