అధ్యాత్మ సంకీర్తన
రేకు: 325-5
సంపుటము: 4-146
రేకు: 325-5
సంపుటము: 4-146
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| సుగ్రీవనారసింహుని జూడరో వాఁడె అగ్రపూజ గొన్నవాఁడు ఆదిసింహము | ॥పల్లవి॥ |
| దేవతలు జయవెట్టి దివినుండి పొగడఁగ దేవులతోఁ గూడున్నాఁడు దివ్య సింహము భావింప నెట్టనెదుట ప్రహ్లాదుఁడుండఁగాను వేవేలు నవ్వులు నవ్వీ విజయ సింహము | ॥సుగ్రీవ॥ |
| అసురలను గెలిచి అదె సింహాసనముపై వెసఁగొలువున్నాడు వీర సింహము పసిడివర్ణముతోడ బహుదివ్యాయుధాలతో దెసల వెలుగొందీని ధీర సింహము | ॥సుగ్రీవ॥ |
| నానాభరణాలు వెట్టి నమ్మినదాసులనెల్ల ఆనుకొని రక్షించీఁ బ్రత్యక్ష సింహము పూని శ్రీవేంకటాద్రిని బుధులెల్లాఁ గొలువఁగా నానావరము లొసఁగీ మానవ సింహము | ॥సుగ్రీవ॥ |


