అధ్యాత్మ సంకీర్తన
రేకు: 326-4
సంపుటము: 4-151
రేకు: 326-4
సంపుటము: 4-151
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ధన్నాసి
| దేవుదేవుఁ డితడే దివ్యమూరితి యేవలఁ జూచినఁ దానే యీ రూపై వున్నాఁడు | ॥పల్లవి॥ |
| వేంకటాచలము మీఁది విశ్వరూప విశేషము అంకెల ననంతావతారాలైన విశేషము లంకె సింగారాది సర్వాలంకార విశేషము యింకనిమహిమలతో నీరూపై వున్నాఁడు | ॥దేవు॥ |
| అందరిలో నంతర్యామియైన విశేషము కందర్పుఁబుట్టించిన ఘన విశేషము ముందు జగముసృష్టించి మూలమైన విశేషము యిందరితోఁ గూడుకొని యీరూపై వున్నాఁడు | ॥దేవు॥ |
| పరము యోగీంద్రులెల్ల భావించిన విశేషము అరుదైన వేదవేదాంతార్థ విశేషము పరగ నలమేల్మంగపతియై శ్రీవేంకటేశుఁ- డిరవై దాసులఁ గావ నీరూపై వున్నాఁడు | ॥దేవు॥ |


