అధ్యాత్మ సంకీర్తన
రేకు: 327-5
సంపుటము: 4-158
రేకు: 327-5
సంపుటము: 4-158
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| ఎక్కుడు బ్రహ్మపట్టాన కిదె కాచుకున్నవాఁడు పక్కటిల్లి సంతోసానఁ బెద్దహనుమంతుఁడు | ॥పల్లవి॥ |
| తూరుపుఁ బడుమరాను దొడ్డగా జంగ చాఁచి సారెకుఁ నర్కునివద్దఁ జదివీ వాఁడే ధీరతతోఁ దనమేను దిక్కులెల్లాఁ బిక్కటిల్ల బీరముచూపీ వాఁడె పెద్దహనుమంతుఁడు | ॥ఎక్కు॥ |
| మిన్ను నేల నేకముగా మించినవాల మెత్తి సన్నుతిగా వలకేల చాఁచినవాఁడు పన్నుగడై రాఘవునిబంట్లలోపలనెల్లా పెన్నిధియై యున్నవాఁడు పెద్దహనుమంతుఁడు | ॥ఎక్కు॥ |
| మరిగి రేయుఁబగలు మతంగపర్వతమాడ బిరుదులతోడను బెరసీ వాఁడే యిరవై శ్రీవేంకటేశుహితుఁడై యెప్పుడుఁ బెచ్చు- పెరుగుచు నున్నవాఁడు పెద్దహనుమంతుఁడు | ॥ఎక్కు॥ |


