అధ్యాత్మ సంకీర్తన
రేకు: 327-6
సంపుటము: 4-159
రేకు: 327-6
సంపుటము: 4-159
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
| ఇతఁడు తారకబ్రహ్మ మీతఁడు సర్వేశ్వరుఁడు రతికెక్కఁ గొలిచిన రక్షించు నితఁడు | ॥పల్లవి॥ |
| తరణివంశజుడై తాటకను హరియించి అరుదుగ విశ్వామిత్రుయాగము గాచి హరునివిల్లు విరిచి యట్టె సీతఁ బెండ్లియాడి పరశురాముని నిజబలిమి చేకొనెను | ॥ఇతఁ॥ |
| మునులకభయమిచ్చి మొగి నసురలఁ ద్రుంచి ఘనమైన మాయామృగముఁ జంపి కినిసి వాలిఁ గొట్టి సుగ్రీవునిఁ బట్టముగట్టి వనధి బంధించి లంక వడిఁ జుట్టుముట్టెను | ॥ఇతఁ॥ |
| బలురావణునిఁ జంపి పుష్పకముపైఁ దాఁ జేకొని లలి విభీషణునకు లంక ఇచ్చి చెలఁగి యయోధ్య యేలి శ్రీవేంకటాద్రిమీఁద వెలయ రాముఁడు దానై విశ్వమెల్లా నేలెను | ॥ఇతఁ॥ |


