అధ్యాత్మ సంకీర్తన
రేకు: 328-1
సంపుటము: 4-160
రేకు: 328-1
సంపుటము: 4-160
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| అడర శ్రావణబహుళాష్టమి నేఁ డితఁడు నడురేయి జనియించినాఁడు చూడఁగదరే | ॥పల్లవి॥ |
| గొంతిదేవిమేనల్లుఁడు గోపసతులమగఁడు పంతపుపాండవులకు బావమరఁది వంతుతో వసుదేవదేవకులకుమారుఁడు ఇంతటికృష్ణుఁడు జనియించినాఁడుగదరే | ॥అడ॥ |
| బలరామునితమ్ముఁడు పంచసాయకునితండ్రి మలసి మేటైనయభిమన్యునిమామ లలి సాత్యకిసుభద్రలకుఁ దోఁబుట్టినయన్న ఇలపైఁ గృష్ణుఁడు జనియించినాఁడుగదరే | ॥అడ॥ |
| సూరసేనుమనుమఁ డచ్చుగ ననిరుద్ధుతాత పౌరవయాదవలోకబాంధవుఁడు ఆరయ శ్రీవేంకటేశుఁ డలమేల్మంగకుఁ బతి యీరీతిఁ గృష్ణుఁడు జనియించినాఁడుగదరే | ॥అడ॥ |


